Visakhapatnam: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు జాతీయ నంబర్ 1 ర్యాంక్!

Visakhapatnam: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26లో 10 లక్షల జనాభా కేటగిరీలో విశాఖ జీవీఎంసీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 11 Nov 2026 7:39 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు జాతీయ నంబర్ 1 ర్యాంక్!

విశాఖపట్నం: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26 జాతీయ స్థాయి అవార్డుల్లో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) దేశంలోనే అరుదైన చారిత్రక ఘనతను సాధించింది. విశాఖపట్నం నగర చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల విభాగంలో 'స్వచ్ఛ షెహర్' కేటగిరీలో ప్రథమ స్థానం (First Rank) సాధించి విశాఖ నగరం జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి. సంపత్ కుమార్‌లతో కలిసి జీవీఎంసీ కమిషనర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, విశాఖపట్నం నగర చరిత్రలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందన్నారు. ఈ పురస్కారం ఒక్క జీవీఎంసీ సంస్థకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, నగర ప్రజలందరి సమష్టి విజయం అని పేర్కొన్నారు.

నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం సహకరిస్తున్న నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జీవీఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యంగా ప్రతిరోజూ రాత్రింబవళ్లు, ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా నగర పారిశుద్ధ్య పరిరక్షణలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఈ విజయానికి ప్రధాన బలమని కొనియాడారు. వారి నిరంతర శ్రమ, అంకితభావంతో పాటు విశాఖ నగర పరిశుభ్రతకు నిత్యం సహకరిస్తున్న నగర ప్రజల భాగస్వామ్యం ఈ చారిత్రక విజయానికి దోహదపడిందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమకు, అంకితభావానికి, నగర ప్రజల సహకారానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే, విశాఖపట్నం నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26లో అత్యుత్తమ స్థానం సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ యంత్రాంగానికి నిరంతరం విలువైన సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తూ ఈ విజయానికి ప్రత్యేకంగా దోహదపడిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్‌కు కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

" ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ఆరు పురస్కారాలు.. దేశంలో రెండో స్థానం!"

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొత్తం ఆరు నగరాలు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి పురస్కారాలను దక్కించుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 60 జాతీయ అవార్డులు ప్రదానం చేయగా, ఆంధ్రప్రదేశ్ ఆరు అవార్డులను సాధించి అవార్డుల సంఖ్య పరంగా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఐదో స్థానంలో ఉన్న రాష్ట్రం ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం రాష్ట్రానికి గర్వకారణం.

" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించిన పురస్కారాల వివరాలు:"

* గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ): 10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల విభాగంలో 'స్వచ్ఛ షెహర్' ప్రథమ స్థానం.

విజయవాడ: 'నేషనల్ క్లీన్ సిటీ' విభాగంలో తృతీయ స్థానం.

గుంటూరు: 3 లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల 'స్వచ్ఛ షెహర్' విభాగంలో తృతీయ స్థానం.

రాజమండ్రి: 'స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' పురస్కారం.

తిరుపతి: 'స్వచ్ఛ షెహర్ జోడీ' విభాగంలో తృతీయ స్థానం.

కుప్పం: 'స్వచ్ఛ షెహర్ జోడీ' విభాగంలో తృతీయ స్థానం.

దేశవ్యాప్తంగా 4,751 నగరాలను స్వచ్ఛ సర్వేక్షణ్‌-2025-26లో మూల్యాంకనం చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి ఆరు నగరాలు జాతీయ స్థాయి పురస్కారాలను సాధించడం విశేషమని కమిషనర్ తెలిపారు.

" ప్రజా భాగస్వామ్యమే స్వచ్ఛతకు అసలైన బలం!"

స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నిరంతరం కొనసాగాల్సిన సామాజిక బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలకు జీవీఎంసీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

భవిష్యత్తులో కూడా విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, సుందరమైన నగరాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు జీవీఎంసీ యంత్రాంగం మరింత అంకితభావంతో పనిచేస్తుందని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ఈ జాతీయ స్థాయి గుర్తింపును స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరి భాగస్వామ్యంతో 'స్వచ్ఛ విశాఖ – సుందర విశాఖ' లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.