Madhurawada: మధురవాడలో మంచినీటి కొరత రోడ్లపాలవుతున్న వేలాది లీటర్ల నీరు!
Madhurawada: మధురవాడ సాయిరాం కాలనీలో తాగునీటి పైప్‌లైన్లు పగిలి వేలాది లీటర్ల నీరు వృథాగా రోడ్లపాలవుతోంది. తాగునీటి కొరతతో అల్లాడుతున్న స్థానికులు.
Madhurawada: మధురవాడలో మంచినీటి కొరత రోడ్లపాలవుతున్న వేలాది లీటర్ల నీరు!
Madhurawada: ఒకవైపు బోర్లు అడుగంటి, వర్షాలు లేక గుక్కెడు మంచి నీటి కోసం స్థానికులు నరకం చూస్తుంటే.. మరోవైపు అధికారుల బాధ్యతారాహిత్యంతో వేల లీటర్ల నీరు రోడ్లపాలవుతోంది. మధురవాడ జోన్, 6వ వార్డు పరిధిలోని సాయిరాం కాలనీలో నీటి పైపులైన్ వ్యవస్థ లీకేజీలకు నిలయంగా మారింది.
రెండు చోట్ల పైపులు పగిలి జలపాతంలా నీరు వృథాగా పోతున్నా,నీటి సరఫరా విభాగానికి చెందిన క్షేత్రస్థాయి సిబ్బందికి అసలు పట్టింపే లేదు. తరచూ ఒకే ప్రదేశంలో పైపులు పగులుతున్నా తాత్కాలిక మరమ్మతులతో మమ అనిపిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
ఒకవైపు దాహార్తితో జనం అల్లాడుతుంటే,ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరు వరదలా మురికికాల్వలలో చేరుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైపులైన్లకు శాశ్వత పరిష్కారం చూపి, నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.




