Anakapalli: అనకాపల్లిలో చెరువులా మారిన రోడ్డు.. చిరు వ్యాపారుల తీవ్ర ఇబ్బందులు!
Anakapalli: తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డు చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతోంది. మురుగు కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Anakapalli: అనకాపల్లిలో చెరువులా మారిన రోడ్డు.. చిరు వ్యాపారుల తీవ్ర ఇబ్బందులు!
అనకాపల్లి: చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. మురుగునీటి కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతూ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సూదికొండ మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు.
అనకాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చే తహసీల్దార్ కార్యాలయంతో పాటు సమీపంలో సబ్‌జైలు వంటి ముఖ్యమైన కార్యాలయాలు ఉన్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉండటం విచారకరమన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి మండల అధ్యక్షులు కట్టమూరి నూక అప్పారావుతో కలిసి మాణిక్యాలరావు చెరువును తలపిస్తున్న రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
వర్షపు నీటితో రహదారి పూర్తిగా నిండిపోవడంతో నాలుగైదు రోజుల పాటు వ్యాపారాలు సాగడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు తగ్గిన తర్వాత కూడా రహదారి మొత్తం బురదమయంగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఏళ్లు గడుస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోయారు. ప్రజలు, వాహనదారులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి కాలువల నిర్మాణంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూదికొండ మాణిక్యాలరావు, కట్టమూరి నూక అప్పారావు కోరారు.




