Kurupam: కురుపాం గురుకులంలో 60 మంది విద్యార్థినులకు వైరల్ ఫీవర్
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకులంలో 60 మందికి పైగా విద్యార్థినులు వైరల్ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే జగదీశ్వరి పరామర్శించారు.
Kurupam: కురుపాం గురుకులంలో 60 మంది విద్యార్థినులకు వైరల్ ఫీవర్
కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినుల అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు రోజులుగా 50 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్నారు. జ్వరం, తలనొప్పి, విరేచనాలు, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో విద్యార్థినులు బాధపడుతున్నట్లు సమాచారం. విద్యార్థినులు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, మలేరియా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వ్యాధి నిర్ధారణ కాలేదని వైద్యులు వెల్లడించారు.
ఒకే గదిలో 60 మందికి పైగా విద్యార్థినులకు వైద్యం అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. తొలుత కొద్దిమంది మాత్రమే అస్వస్థతకు గురైనట్లు చెప్పారని, పాఠశాలలోకి వెళ్లి పరిశీలించగా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు వైద్యం పొందుతున్నారని తెలిపారు. తమ పిల్లలను చూపించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకుండా మాదలంగి పీహెచ్సీకి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.
పాఠశాలను సందర్శించిన పుష్పశ్రీవాణి
విద్యార్థినుల అస్వస్థత విషయం తెలుసుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి, వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి గురుకుల పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఒకే గదిలో 60 మందికి పైగా విద్యార్థినులకు వైద్యం అందిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థినులకు ఇలాంటి వైద్య సదుపాయాలేనా కల్పించేది అంటూ అధికారులను ప్రశ్నించారు. గతంలో ఇదే పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అనారోగ్యంతో మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఎమ్మెల్యే జగదీశ్వరి
ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా పాఠశాలను సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాలలో పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
టీడీపీ నేత వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ కూడా విద్యార్థినులను పరామర్శించి అధికారులతో మాట్లాడారు. మరోవైపు డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఐటీడీఏ అధికారులు, సబ్ కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలోనే విద్యార్థినులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.




