Parvathipuram: వాయుసేనలో 'అగ్నివీర్' ఉద్యోగాలు జూలై 26 వరకు అవకాశం

Parvathipuram: భారత వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 26, 2026.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 15 July 2026 5:08 PM IST
Parvathipuram
X

Parvathipuram: వాయుసేనలో 'అగ్నివీర్' ఉద్యోగాలు జూలై 26 వరకు అవకాశం

పార్వతీపురం: జిల్లా యువతకు సువర్ణావకాశం లభించింది. భారత వాయుసేనలో అగ్నిపథ్ స్కీం ద్వారా ‘అగ్నివీర్-వాయు సేన’ (Airmen - Med Asst & Agniveervayu - Combatant) ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్విజ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ జూలై 26 అని తెలిపారు.

ఈ పోస్టులలో సైన్స్ విభాగం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్) లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలని లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌లతో 2 ఏళ్ల ఒకేషనల్ కోర్సు 50% మార్కులతో పాస్ అయి ఉండాలన్నారు.

ఇతర విభాగాల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే అభ్యర్థులు 01.07.2005 నుండి 01.01.2010 మధ్య జన్మించి ఉండాలని, శారీరక ప్రమాణాలలో ఎత్తు కనీసం 152 సెంటిమీటర్లు ఉండాలని, ఎత్తుకు తగిన బరువు ఉండాలని, గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెంటిమీటర్ల వ్యాకోచం చెందాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలుత ఆన్‌లైన్ వ్రాత పరీక్ష నిర్వహిస్తారన్నారు.

అందులో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారని, ఎంపికైన అభ్యర్థులు అగ్నివీర్-వాయు సేనలో 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీస్ అందించాల్సి ఉంటుందని చెప్పారు. అర్హత, ఆసక్తి గల విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iafrecruitment.edcil.co.in ద్వారా నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ఇతర పూర్తి వివరాల కోసం కార్యాలయపు పనివేళల్లో జూనియర్ సహాయకులు కె. శ్రీనివాసరావు (ఫోన్ నెం. 9494334044) గారిని సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story