Kurupam: కురుపాంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనం!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.
Kurupam: కురుపాంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనం!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను నాయకులు వివరించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతిని సభలో ప్రస్తావించారు.
ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని మరిన్ని సంవత్సరాలు కొనసాగించేలా కృషి చేయాలని కోరారు.
సభలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరడంతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకడా రామకృష్ణ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయోత్సవ సభను విజయవంతం చేశారు.




