Vizianagaram: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ
Vizianagaram: ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని ఏపీ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
Vizianagaram: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ
విజయనగరం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఒక కుటుంబం - ఒక పారిశ్రామిక వేత్త లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరింత సహాయ సహకారాలు ఉండాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న కొండపల్లి మంగళవారం రాత్రి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేతో 28 అక్బర్ రోడ్‌లోని రామ్ జీ స్వగృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ( PMEGP ) లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను 100 % కు మించి 170 % వరకు సాధించిన నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు మరింతగా పెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని... ఎస్‌కే యూనివర్సిటీ, విజయనగరం జేఎన్‌టీయూలో ఎంఎస్ఎంఈ ఎక్స్‌టెన్షన్ సెంటర్ల ఏర్పాటు కార్యాచరణను వేగవంతం చేయాలని మంత్రి మాంఝీ గారిని కోరగా అందుకు మాంఝీ సుముఖత వ్యక్తం చేశారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 11 - 13వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో కార్యక్రమానికి మాంఝీని మంత్రి కొండపల్లి సాదరంగా ఆహ్వానించారు.




