Kurupam: ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: 5,500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం!

Kurupam: ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో నవోదయం-2.0 లో భాగంగా ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు నిర్వహించి 5,500 లీటర్ల బెల్లపు ఊట, 370 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసింది.

V.SESHU	, KURUPAM
Published on: 12 July 2026 9:34 PM IST
Kurupam
X

Kurupam: ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: 5,500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం!

కురూపం: నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సంయుక్త దాడులు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని సందుబడి, పల్లం తులసి గ్రామాల్లో ఒడిశా ఎక్సైజ్ అధికారుల సహకారంతో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా నాటు సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన సుమారు 5,500 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే బట్టీల్లో తయారు చేసి డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 370 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని అధికారుల సమక్షంలో నాశనం చేశారు. నాటు సారా తయారీకి వినియోగించేందుకు సిద్ధంగా ఉంచిన 500 కిలోల నల్లబెల్లాన్ని కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.వి. గోపాలకృష్ణ బృందం, పార్వతీపురం టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వి.వి.ఎస్. శేఖర్ బాబు సిబ్బంది, సాలూరు, సీతానగరం, పాలకొండ ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే రాయగడ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బాలక బిషి, రాయగడ మొబైల్ ఇన్‌స్పెక్టర్ కె.పి. సింధూర్, కురుపాం ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటు సారా తయారీ, అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ఒడిశా పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సహకారంతో సంయుక్త దాడులను మరింత ముమ్మరం చేస్తామని కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story