Kurupam: కురుపాం అటవీశాఖ ఆఫీసులో వినతిపత్రం

Kurupam: అటవీశాఖ కార్యాలయంలో రేంజర్ జి. గంగదేవికి గిరిజన సంఘాల వినతిపత్రం.. అక్రమ వసూళ్లు, అభివృద్ధి పనుల నిలిపివేతపై నిరసన.

V.SESHU	, KURUPAM
Published on: 1 Jun 2026 7:38 PM IST
Kurupam
X

Kurupam: కురుపాం అటవీశాఖ ఆఫీసులో వినతిపత్రం

కురుపాం: గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములపై అటవీశాఖ అధికారులు వేధింపులు, దౌర్జన్యాలు నిలిపివేయాలని, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న రహదారులు సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించవద్దని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘం నాయకుడు బి. అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కురుపాంలోని అటవీశాఖ కార్యాలయంలో రేంజర్ జి. గంగదేవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై అటవీశాఖ అధికారులు అనవసర ఆంక్షలు విధిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు ఉన్న హక్కులను గౌరవించి, వారి జీవనాధారమైన పోడు వ్యవసాయాన్ని రక్షించాలని కోరారు.

గిరిజన గ్రామాల్లో రహదారులు, తాగునీటి పథకాలు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనుల సమయంలో అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా సహకరించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు.

మండలంలోని గోటివాడ గ్రామంలో ఉపాధి హామీ నిధులతో మంజూరైన సాగునీటి చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్నారని, అలాగే నీలకంఠాపురం పరిసర గిరిజన గ్రామాల్లో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయాల విషయంలో అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకుంటూ నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జియ్యమ్మవలస మండలంలో గిరిజనులు పొయ్యి కోసం కట్టెలు సేకరించడాన్ని అడ్డుకుని నగదు వసూలు చేసి రసీదులు ఇవ్వడం సరికాదని విమర్శించారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరించి, వారి హక్కులను పరిరక్షించే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story