Vizianagaram: సత్య కళాశాల ఆధ్వర్యంలో ఏయూ మహిళల కబడ్డీ టోర్నీ ప్రారంభం!
Vizianagaram: విజయనగరం సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏయూ మహిళల కబడ్డీ టోర్నమెంట్ 2026–27లో విశాఖ విమెన్స్ కళాశాల విజేతగా నిలిచింది.
Vizianagaram: సత్య కళాశాల ఆధ్వర్యంలో ఏయూ మహిళల కబడ్డీ టోర్నీ ప్రారంభం!
విజయనగరం: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ క్రీడా మైదానంలో సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళల కబడ్డీ టోర్నమెంట్ 2026–27 ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మరియు ప్రముఖుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ. పల్లవి గారు, గౌరవ అతిథిగా శ్రీ బొమ్మన రామారావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి చేతులమీదుగా గెలిచిన టీం లకు ట్రోఫీ లను అందజేశారు. ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ, విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రస్తుత తరుణంలో క్రీడల్లో కూడా తమ ప్రతిభను నిరూపించుకోవాలని, ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థినుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయవచ్చని తెలిపారు.
ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఎ. పల్లవి గారు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని అన్నారు. ప్రతి క్రీడాకారిణి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
గౌరవ అతిథి శ్రీ బొమ్మన రామారావు గారు మాట్లాడుతూ, విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడలు జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి విలువలను నేర్పుతాయని, ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారిణులకు పిలుపునిచ్చారు.
సత్య విద్యా సంస్థల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ్ రావు మాట్లాడుతూ, తమ విద్యాసంస్థ విద్యార్థుల విద్యా వికాసంతో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. మహిళా క్రీడాకారిణులకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా వారి ప్రతిభను వెలికితీయడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని, ఐకమత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వి. రామమూర్తి మాట్లాడుతూ, విద్యా సంస్థలు క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయగలవని తెలిపారు. క్రీడాకారిణులు క్రమశిక్షణతో, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 8 మహిళా జట్లు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 10 మంది క్రీడాకారిణులను ప్రాబబుల్స్ గా పాల్గొంటాం జరిగింది. విశాఖ విమెన్స్ డిగ్రీ కళాశాల విజేత కాగా ప్రగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల రన్నర్ గాను , తృతీయ స్థానం సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల పొందింది. నాలుగో స్థానంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, చీపురుపల్లి సాధించింది. పోటీల నిర్వహణతో క్రీడా మైదానం సందడిగా మారింది. వివిధ కళాశాలల క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, వ్యాయామ విద్యా విభాగ ప్రతినిధులు, సత్య డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీ. ప్రసాద్ మరియు శ్రీ. మహేష్, సిబ్బంది, క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు.
సెలెక్షన్ టీమ్ Dr. జి. వెంకటేశ్వర రావు, స్పోర్ట్స్ ఆఫీసర్, ఐ ఐ పి ఇ, శ్రీ. వి. ప్రభు కర్ణ, ఫిజికల్ డైరెక్టర్, గొన్న కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, శ్రీమతి. వి. రామలక్ష్మి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చీపురుపల్లి వారు యూనివర్సిటీ టీమ్ 18 మందిని ఎంపిక చేశారు. వీళ్లు సౌత్ జోన్ కి 7th to 12th december 2026 కృష్ణ యూనివర్సిటీ, మచిలీపట్నం లో ఆడతారు.
మహిళా క్రీడాకారిణులకు ప్రోత్సాహం అందిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది.




