Vizianagaram: విజయనగరం సీతంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు!
Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా నేటి యువత ఆలోచనలు, విలువలు అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
Vizianagaram: విజయనగరం సీతంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు!
Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సీతం మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో భగత్సింగ్ జయంతి సందర్భంగా “నేటి యువత ఆలోచనలు, విలువలు, ఆశయాలు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యువత విలువలు, ఆశయాలు, బాధ్యతలు, సమాజంలో వారి పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
కార్యక్రమానికి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఎఫ్ఐ ), అఖిల భారత అధ్యక్షుడు శ్రీ ఆదర్శ్ సాజీ ముఖ్య అతిథిగా, వక్తగా హాజరయ్యారు. భగత్సింగ్ ఆశయాల ప్రాధాన్యతను వివరిస్తూ విద్య, ధైర్యం, విమర్శనాత్మక ఆలోచన, సమానత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత అలవరచుకోవాలని సూచించారు. తప్పులను ప్రశ్నించే ధైర్యంతో పాటు సమకాలీన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, స్వతంత్రంగా ఆలోచించి తమ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని, ప్రజాస్వామ్య, సామాజిక విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని కోరారు.
సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ సమకాలీన సమస్యలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు, జాతీయ నాయకుల జీవితాలు, ఆశయాల నుంచి స్ఫూర్తి పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, అవగాహన, విశాల దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
సీతం ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, విద్య, బాధ్యతాయుత పౌరసత్వం యువత జీవితంలో ముఖ్యమని అన్నారు. జాతీయ నాయకుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది, తమ జ్ఞానం, నైపుణ్యాలను సమాజ అభివృద్ధికి వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్, ప్రతినిధులు, సీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో యువత, విద్య, సామాజిక బాధ్యత, పాఠశాల, ఉన్నత విద్యా రంగాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు ఆదర్శ్ సాజీతో చర్చించారు.




