Bobbili: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై రాజకీయ కుట్ర

Bobbili: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 18 Aug 2026 11:46 PM IST
Bobbili
X

Bobbili: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై రాజకీయ కుట్ర

బొబ్బిలి: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. బొబ్బిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా డా. ఆర్.ఎస్. రత్నాకర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పంజాబ్‌, హర్యానాలో పడిందని, ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దానిని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా తీసుకెళ్తోందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయి, తెలుగు రాష్ట్రాల్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే పరిమిత సంఖ్యలోనే ప్రజలకు ప్రయోజనం అందుతోందని, ఆ ప్రయోజనాలను మరింత విభజించడం వల్ల దళిత వర్గాల మధ్య ఐక్యత దెబ్బతింటుందని డా. రత్నాకర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను ఏ విధంగా సమన్యాయంగా పంచుతారని ఆయన ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ కులాలకు ఈ ప్రయోజనాలను ఏ విధంగా పంపిణీ చేస్తారో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“సామాజిక న్యాయం రిజర్వేషన్లలో మాత్రమేనా? దేశ సంపద పంపిణీలో సామాజిక న్యాయం అక్కర్లేదా?” అని డా. రత్నాకర్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాల్లో కూడా సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎస్సీ వర్గీకరణ చట్టపరమైన ప్రక్రియ ముందుకు వెళ్లినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని డా. రత్నాకర్ స్పష్టం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడితే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను పునఃపరిశీలించాల్సి వస్తుందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఎన్నడూ ఎదుర్కొనని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో మాల ప్రజాప్రతినిధులు తమ వర్గం తరఫున గళమెత్తాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల పట్ల విధేయతతో పాటు సామాజిక వర్గ ప్రయోజనాల పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతుల్లో నిరంతర పోరాటం కొనసాగిస్తామని డా. ఆర్.ఎస్. రత్నాకర్ ప్రకటించారు. “పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టపరమైన నిర్ణయం తీసుకునే వరకు మా శాంతియుత పోరాటం కొనసాగుతుంది. మాల సామాజిక వర్గ ప్రజలు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రేగిడి రామకృష్ణ, సింగారపు ఈశ్వరరావు, మజ్జి సతీష్, లోచర్ల నరసింహారావు, బోకర నారాయణరావు, యడ్ల గోపి, గడ్డియ్య, చంద్రమోహన్, కె. వీరేష్, తలసముద్రం సూర్యం తదితరులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story