Parvathipuram: పార్వతీపురం బైపాస్ రోడ్డుకు మోక్షం.. కలెక్టర్ సీరియస్ ఆదేశాలు!

Parvathipuram: పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Jun 2026 2:58 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం బైపాస్ రోడ్డుకు మోక్షం.. కలెక్టర్ సీరియస్ ఆదేశాలు!

పార్వతీపురం: పార్వతీపురం పట్టణ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని కల్పించడమే జిల్లా యంత్రాంగం ప్రథమ ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం కలెక్టరేట్ నుండి మున్సిపల్, పోలీస్, ఆర్ అండ్ బి, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు,బైపాస్ రోడ్డు,ఫ్లైఓవర్ సమీపంలో ఎదురవుతున్న రద్దీ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ అనేది కేవలం ఒక శాఖకు సంబంధించిన అంశం కాదని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

బైపాస్ రోడ్డు అధ్వాన్నంగా మారడం వల్ల భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డు శాశ్వత మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరయ్యాయని, త్వరలో మరమ్మతులు చేపడాతామని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.

దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే పనులు ప్రారంభించాలని, అప్పటివరకు తాత్కాలికంగా గుంతలను పూడ్చి ప్రయాణాన్ని సుగమం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలి.

పనుల రోజువారీ పురోగతిని పర్యవేక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో రద్దీ వేళలు, వాహనాల రకాలను విశ్లేషించేందుకు ప్రధాన జంక్షన్లలో వీడియోగ్రఫీ ద్వారా పోలీస్ శాఖ సైంటిఫిక్ ట్రాఫిక్ అనాలిసిస్ సర్వేను చేపట్టాలని అన్నారు.

మున్సిపల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు, వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.నిరంతర పర్యవేక్షణ ద్వారానే పనుల్లో వేగం పెరుగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి రంగంలోకి దిగుతామని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story