Bobbili: బొబ్బిలిలో కలెక్టర్ పర్యటన.. ప్రజా సమస్యలపై ముమ్మర తనిఖీలు!
Bobbili: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ (PGRS) అర్జీలను స్వీకరించిన విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.
Bobbili: బొబ్బిలిలో కలెక్టర్ పర్యటన.. ప్రజా సమస్యలపై ముమ్మర తనిఖీలు!
Bobbili: ఒక నియోజకవర్గం - ఒక నెల - నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా రెండవ నెల, రెండవ వారంలో బొబ్బిలి నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బొబ్బిలి మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 70 ఫిర్యాదులు అందాయి. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు, ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజలు కలెక్టర్‌కు అందజేశారు.
ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పిజిఆర్ఎస్‌లో నమోదైన ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి అర్హత కలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఆర్డీవో రామ్మోహన రావు, బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




