Vizianagaram: విజయనగరంలో 'యోగాంధ్ర' సందడి.. యోగా చేస్తున్న కలెక్టర్!
Vizianagaram: విజయనగరం రామనారాయణంలో ఘనంగా 'యోగాంధ్ర' కార్యక్రమం. యోగా ద్వారానే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వెల్లడించారు.
Vizianagaram: విజయనగరంలో 'యోగాంధ్ర' సందడి.. యోగా చేస్తున్న కలెక్టర్!
విజయనగరం: భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం యోగా అని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రమైన ‘రామనారాయణం’ వేదికగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని గురువారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, సుమారు రెండు వేలమంది యోగా సాధకులు భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, యోగాసనాలను ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు.
దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ పోషణలో ప్రతి ఒక్కరూ నిమగ్నమైపోయి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నిరంతరం యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ రోజుకి కనీసం 30 నిమిషాలు యోగా కోసం కేటాయించాలని కలెక్టర్ కోరారు. అంతరం యోగా గురువులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణిలతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, రామనారాయణం ట్రస్టీ సీతారామయ్య, నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్, డి ఆర్ డి ఎ, ఐసిడిఎస్, ఆయుష్ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
రామనారాయణం ప్రాంగణం సుమారు రెండు వేలమంది యోగా సాధకుల నినాదాలతో, క్రమశిక్షణతో కూడిన యోగాసనాలతో అలరారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.




