Parvathipuram: జీవితం అమూల్యం.. ఆత్మహత్య పరిష్కారం కాదు..

Parvathipuram: మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ, మానసిక ఒత్తిడి సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 1 July 2026 5:14 PM IST
Parvathipuram
X

Parvathipuram: జీవితం అమూల్యం.. ఆత్మహత్య పరిష్కారం కాదు..

పార్వతీపురం: మహిళలు, కౌమారదశ యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యల నివారణపై స్థానిక గాయత్రి డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె. కనకదుర్గ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) ఎ. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీఓ మాట్లాడుతూ విద్యా ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంబంధాలు, సోషల్ మీడియా ప్రభావం, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. అయితే ఆత్మహత్య ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందని చెప్పారు.

ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని మనసులో దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో పంచుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు.

అదేవిధంగా మహిళలపై హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణ, సైబర్ నేరాల నుంచి రక్షణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్‌లైన్–1098, మహిళా హెల్ప్‌లైన్–181, టెలీ మానస్–14416 సేవల గురించి వివరించి, అవసరమైనప్పుడు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story