Vizianagaram: రాజ్యాంగం అంటే ప్రతి మనిషి గౌరవంగా బతికే హక్కుపత్రం: సిరి సహస్ర!

Vizianagaram: రాజ్యాంగం అంటే ప్రతి మనిషి గౌరవంగా బతికే హక్కుపత్రమని విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్ర గురువారం రాజ్యాంగ దినోత్సవంలో అన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Updated on: 26 Nov 2026 9:29 PM IST
Vizianagaram
X

Vizianagaram: రాజ్యాంగం అంటే ప్రతి మనిషి గౌరవంగా బతికే హక్కుపత్రం: సిరి సహస్ర!

Vizianagaram: ఒక సామాన్యుడు తలెత్తుకుని నిలబడగలిగే ఆత్మగౌరవం ఎక్కడ మొదలవుతుంది? అవకాశాల తలుపులు అందరికీ సమానంగా తెరుచుకునే చోట. పాలకులైనా, పౌరులైనా చట్టం ముందు సమానమేనని నిలబడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భారత రాజ్యాంగం ఇచ్చిన భరోసా నుంచి. ఆ భరోసాకు ఊపిరి పోసిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, ప్రస్తుత విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆమె రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సిరి సహస్ర మాట్లాడుతూ, రాజ్యాంగం ఆమోదించిన తేదీని, అమల్లోకి వచ్చిన తేదీని ప్రస్తావించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుండి అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందని వివరించారు. రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాలని కోరారు.

అంబేద్కర్ అందించిన సామాజిక న్యాయం, విద్య, స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనే నాలుగు సూత్రాలు నేటి తరానికి కూడా గొప్ప మార్గదర్శకాలని ఆమె పేర్కొన్నారు. ఆనాడే ఉన్నతమైన ఆదర్శాలతో నిలిచిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. నేటి సమాజంలో ఒక మనిషి ఎలా బతకాలో, ఎలాంటి విలువలు పాటించాలో మన రాజ్యాంగాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు.

రాజ్యాంగం అనేది కేవలం పరిపాలించే వ్యక్తులకే పరిమితమైనది కాదని, దేశంలోని ప్రతి మనిషికి న్యాయం అందించే గొప్ప వ్యవస్థ అని సిరి సహస్ర స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే అంశాలను రాజ్యాంగం నిర్దేశిస్తుందని తెలిపారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటుతో పాటు ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో రాజ్యాంగం స్పష్టంగా రూపొందించిందని ఆమె వివరించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.