Markapuram: మానవ అక్రమ రవాణా నిర్మూలనపై జిల్లా కలెక్టర్ పిలుపు!
Markapuram: మార్కాపురంలో కలెక్టర్ ఎం. విజయ సునీత చేతుల మీదుగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
Markapuram: మానవ అక్రమ రవాణా నిర్మూలనపై జిల్లా కలెక్టర్ పిలుపు!
మార్కాపురం: మానవ అక్రమ రవాణా నిర్మూలన సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో 'వెట్టి విమోచన కొఅలిషన్ నెట్వర్క్' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 'ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం' పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని అతిగా ఆశ చూపే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. పిల్లలను ఒంటరిగా వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా పెళ్లి పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాల్లో అనుమానం వస్తే, పోలీసులను సంప్రదించాలన్నారు. అదే విధంగా సమాజంలో, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వద్ద మానవ అక్రమ రవాణా వంటి అమానుష చర్యలపై విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
బాధితులకు అండగా నిలుస్తూ, ఈ రుగ్మతను సమూలంగా నిర్మూలించేందుకు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 'వెట్టి విమోచన కొఅలిషన్ నెట్వర్క్' సంస్థ సభ్యులు అనీల్ రాజు, ఏలీయా, సాడ్స్ ప్రతినిధి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




