Jiyyammavalasa: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
Jiyyammavalasa: జియమ్మవలస నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు.
Jiyyammavalasa: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
జియమ్మవలస: ప్రజల నుంచి వచ్చే అర్జీలను, సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జియమ్మవలస మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన కురుపాం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి తాగునీరు, రహదారులు, పింఛన్లు, భూ సమస్యలు, రేషన్ కార్డులు మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎక్కడా వినతులు పెండింగ్‌లో ఉండకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలంటూ అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధుల మంజూరు ద్వారా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జియమ్మవలస మండల పరిషత్ అభివృద్ధి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.




