Parvathipuram: మన్యం జిల్లాలో వినూత్న ప్రయోగం.. వాగుల వద్దే దోమల అంతం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా నివారణకు కలెక్టర్ ప్రభాకర రెడ్డి 'లార్వా వేట', 'వాగు పండగ' కార్యక్రమాలను ప్రారంభించారు.
Parvathipuram: మన్యం జిల్లాలో వినూత్న ప్రయోగం.. వాగుల వద్దే దోమల అంతం!
పార్వతీపురం: సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా “లార్వా వేట” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్ది తెలిపారు. జియ్యమ్మవలస మండలం గోర్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేవని తెలిపారు.
అయితే గత ఆరు నెలలుగా “మా ఊరికి మలేరియా వద్దు”, “ఫ్రైడే–డ్రై డే” వంటి కార్యక్రమాల ద్వారా చేపట్టిన చర్యల ఫలితంగా కేసులు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న స్వల్ప కేసులను కూడా పూర్తిగా అరికట్టేందుకు “లార్వా వేట” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. మంచినీటిలో పెరిగే దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కొబ్బరి బోండాలు, పాత టైర్లు, రోళ్లు, చెట్టు తొర్రలు, ఇంటి పరిసరాల్లో నీరు నిలిచే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెడతాయని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటికే MPDOలకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.
స్నానం చేసిన తర్వాత చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా ఒంటికి నూనె (Moisturizer) రాసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు మరియు ప్రజలు రాత్రి సమయాల్లో దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. చేతుల నిండా కప్పుకునేలా ఫుల్ హ్యాండ్స్ దుస్తులను ధరించాలి. ప్రతి గ్రామంలోని వాగుల వద్ద లార్వా ఐడెంటిఫికేషన్ ప్రక్రియను ముమ్మరం చేసి లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.
కార్యక్రమంలో దోమల నివారణకు "వాగు వెంబడి" (వాగు పండగ) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాగులను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన దోమల లార్వాను నాశనం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. క్షేత్రస్థాయి సిబ్బంది వాగుల వద్దకు వెళ్లి లార్వా ఉన్న చోట 'ఆయిల్ బాల్స్' వేయడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టాలని అధికారులు ఆదేశించారు.




