Kurupam: పదో తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతులు, కుర్చీలు అందజేత

Kurupam: కురుపాం, శివన్నపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5వేల చొప్పున నగదు బహుమతులు, కుర్చీలు అందజేసిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డా.ప్రసాద్ లాల్.

V.SESHU	, KURUPAM
Published on: 30 Jun 2026 1:40 PM IST
Kurupam
X

Kurupam: పదో తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతులు, కుర్చీలు అందజేత

కురుపాం: కురుపాం మరియు శివన్నపేట ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు ప్రముఖ హృద్రోగ నిపుణులు Dr. ప్రసాద్ లాల్ ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కురుపాం మండల అభివృద్ధి అధికారి శ్రీమతి ఉమా మహేశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

మండల విద్యాశాఖ అధికారి శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.

వైఎస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కొత్తకోట మల్లికార్జునరావు, ప్రధానోపాధ్యాయులు గణేశ్వరరావు, చిన్నారావు, వైఎస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అదే విధంగా, శివన్నపేట పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చొని చదువుతున్న పరిస్థితిని గుర్తించిన డాక్టర్ ప్రసాద్ లాల్ రూ.36 వేల విలువైన 60 కుర్చీలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈవో, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు కొడంగోళ్ల గౌరీశంకరరావు, గంగవంశం రాము తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు, విద్యార్థులు డాక్టర్ ప్రసాద్ లాల్ సేవలను ప్రశంసిస్తూ ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని కొనియాడారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story