Parvathipuram: సాగునీటి విప్లవం.. రైతుల కళ్లలో ఆనందం నింపుతున్న జలధార పనులు

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో దుమ్మంగి రిజర్వాయర్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి.

V.SESHU	, KURUPAM
Published on: 24 April 2026 1:16 PM IST
Parvathipuram
X

Parvathipuram: సాగునీటి విప్లవం.. రైతుల కళ్లలో ఆనందం నింపుతున్న జలధార పనులు

పార్వతీపురం మన్యం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం, డుమ్మంగి గ్రామ రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. ఒకప్పుడు సాగునీటితో కళకళలాడిన డుమ్మంగి రిజర్వాయర్, కాలక్రమేణా నిర్వహణ లేక, పూడిక పేరుకుపోయి శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు పడినా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేక, ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలేది. ముఖ్యంగా శివారు భూములకు చుక్క నీరు అందక పంటలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ గడ్డు పరిస్థితులకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం దుమ్మంగి రిజర్వాయర్ పునరుద్ధరణకు జలధార పనులకు నడుం బిగించింది. యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఈ పనులు ఇప్పుడు దుమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాగునీటి విప్లవానికి నాంది పలుకుతుంది.

ఆధునిక హంగులతో పునర్నిర్మాణం

కేవలం పూడిక తీతకే పరిమితం కాకుండా, ఈ రిజర్వాయర్‌ను సర్వంగ సుందరంగా, పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్ విభాగం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. శిథిలావస్థకు చేరిన స్లూయిస్ మార్గాలను, సర్‌ప్లస్ వీర్‌లను అత్యంత ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా, వరద సమయాల్లో నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించే వీలు కలుగుతుంది. అంతేకాకుండా, నీరు వృధా కాకుండా నేరుగా పొలాలకు చేరేలా ఫీడర్ ఛానళ్లను ప్రక్షాళన చేయనున్నారు. బౌండరీ ట్రెంచ్‌ల నిర్మాణం ద్వారా నీటి ప్రవాహ వేగాన్ని పెంచి, చివరి భూమిలో ఉన్న ఎకరాకు కూడా సమృద్ధిగా సాగునీరు అందేలా చర్యలు గమనార్హం.

​పచ్చని పంటలతో కళకళలాడనున్న గ్రామం

ఈ పునరుద్ధరణ పనుల వల్ల సుమారు 112 ఎకరాల ఆయకట్టుకు శాశ్వత ప్రాతిపదికన సాగునీటి సౌకర్యం కలగనుంది. గతంలో కేవలం వర్షాధార పంటల మీద మాత్రమే ఆధారపడిన రైతులు, ఇప్పుడు వేసవిలో కూడా ధైర్యంగా రెండో పంటను సాగు చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. రిజర్వాయర్‌లో నీటి నిల్వ పెరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతుందని భూగర్భ జల నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల బావులు, బోర్‌వెల్స్‌లో నీరు ఎండిపోకుండా నిరంతరం అందుబాటులో ఉంటుంది. సాగునీటి కష్టాలతో వలస బాట పట్టిన రైతులకు, తమ సొంత భూముల్లోనే పచ్చని పంటలు పండించుకునే అవకాశం లభించడం నిజంగా జీవన జ్యోతి వెలిగినట్లే. దుమ్మంగి రిజర్వాయర్ నిండితే, అది కేవలం నీటి నిల్వ మాత్రమే కాదు, వేలాది మంది రైతన్నల కళ్లలో ఆనంద బాష్పంగా మారనుంది.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story