Gajapathinagaram: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి ₹9.12 కోట్లు సీఎం పాలాభిషేకం
Gajapathinagaram: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ₹9.12 కోట్ల నిధుల జీవో. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలితకుమారి.
Gajapathinagaram: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి ₹9.12 కోట్లు సీఎం పాలాభిషేకం
గజపతినగరం: నియోజకవర్గంలోని జామీ మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు, కార్మికులకు 9 కోట్ల 12 లక్షల రూపాయలు నిధుల మంజూరుకు జీవో జారీ చేయడంతో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కార్మికులు ఆహ్వానం మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం శ్రీ విజయ రామ గజపతి సహకార చక్కెర కర్మాగారం (భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ) వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు థాంక్యూ సీఎం సార్ థాంక్యూ కొండపల్లి సార్ అంటూ ప్లక్కార్డులతో హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లోనే షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి రైతులను, కార్మికులను, ఉద్యోగులను రోడ్డున పడవేశారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి, మంత్రిగా నేను అసెంబ్లీలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడి న్యాయం చేయాలని కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కార్మికులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను గమనించి జీతాలు, విఆర్ఎస్ బకాయిలకు నిధులు మంజూరుకు జీవో విడుదల చేయటం జరిగిందన్నారు.
దశలవారీగా ఫ్యాక్టరీ కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వైసీపీ పార్టీ బురద జల్లుతుందన్నారు. ప్రస్తుతం వచ్చిన జీవో కారణంగా 300 కుటుంబాలకు పైగా న్యాయం జరగడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారన్నారు. బకాయిలు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వంపై అబాండాలు వేస్తూ, అపోహలు సృష్టిస్తున్న వైసీపీ నాయకుల మాటలను నమ్మవద్దని, త్వరలోనే రైతులు, షేర్ హోల్డర్స్ తో సమావేశాలు నిర్వహించి తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి ఉద్ఘాటించారు.
ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ మూతపడిన ఫ్యాక్టరీల జీతభత్యాల కోసం ఏళ్ల తరబడి చూడాల్సి వస్తుందని, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతోనే ఇంత వేగవంతంగా ఉద్యోగులకు, కార్మికులకు వేతనాల జీవో రావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారి ఆకాంక్షలను నెరవేర్చటమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఫ్యాక్టరీ సమస్యలను పెడచెవిన పెట్టిందన్నారు.
రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ చక్కెర కర్మాగార ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలిత కుమారి కృషితోనే నిధులు మంజూరు కోసం జీవో రావడం జరిగిందన్నారు. ఉద్యోగుల కార్మికులు కుటుంబాలకు కూటమి ప్రభుత్వం చేసిన మేలు మరవకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పివివి గోపాల రాజు తదితరులు పాల్గొన్నారు.




