Parvathipuram: విద్యార్థుల విజయమే రాష్ట్ర భవిష్యత్తుకు బాట!

Parvathipuram: ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, కలెక్టర్ ప్రభాకర రెడ్డి 126 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 20 వేల నగదు పంపిణీ చేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 20 July 2026 11:17 PM IST
Parvathipuram
X

Parvathipuram: విద్యార్థుల విజయమే రాష్ట్ర భవిష్యత్తుకు బాట!

పార్వతీపురం, జూలై 20 : రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి విద్యను చేరవేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తేల్చిచెప్పారు. మన్యం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదని, విద్యారంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు, వారికి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులకు, నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అతిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే భ్రమలను వీడి, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సదుపాయాలు, బోధనా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అతిధులు ఆకాంక్షించారు. పదో తరగతి, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతిభావంతులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డుల ప్రదాన కార్యక్రమం సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విప్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ​విద్యార్థుల కృషి, ప్రతిభకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనమన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డులు అందించడం వారి కష్టానికి లభించిన నిజమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం జిల్లా చివరి సరిహద్దు ప్రాంతమైనప్పటికీ, 96.8% ఉత్తీర్ణత నమోదు చేసి, రాష్ట్రంలోనే అగ్రస్థానాల్లో నిలిచి అందరి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ప్రవేశపెట్టినట్లు ఆమె గుర్తుచేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత చదువుల్లో నచ్చిన కోర్సులను ఎంచుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. జిల్లాను విద్యా రంగంలో ముందుంచిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు జిల్లా యంత్రాంగానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డిలతో కలిసి షైనింగ్ స్టార్స్ కు మెడల్, ప్రశంసా పత్రం, రూ. 20 వేల నగదును బహూకరించారు.

విద్యార్థులు ఆధునిక రంగాలపై అవగాహన పెంచుకోవాలి: శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, విద్యార్థులు మార్కులు సాధించడం మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి "షైనింగ్ స్టార్స్"గా ఎంపికైన 126 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం విద్యార్థులు కష్టపడి చదివిన శ్రమకు, క్రమశిక్షణకు దక్కిన గుర్తింపు అని కొనియాడారు. వరుసగా నాలుగోసారి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం జిల్లాకు గర్వకారణమని, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషికి ఇది నిదర్శనమని కొనియాడారు.

ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడమే కాకుండా జీవిత విలువలు, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నేర్పుతారని చెప్పారు. తనకు జీవిత విలువను నేర్పింది కూడా గురువులేనని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి విద్య, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠశాల సౌకర్యాల కోసం భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని, వారు సాంకేతికంగా అభివృద్ధి చెందితే రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని ఆకాంక్షించారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాలపై అవగాహన పెంచుకోవాలని, తెలుగుతో పాటు ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాను విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి సానుకూల అంశాల కోసం వినియోగించుకోవాలని, దానికి బానిసలు కాకూడదని ఆయన హెచ్చరించారు.

పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం : జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, పిల్లల చదువు, ప్రవర్తన, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల ఎదుగుదలకు వారి ప్రోత్సాహం మరియు గైడెన్స్ అత్యంత ఆవశ్యకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, అయితే పిల్లల పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉందన్నారు.

పాఠశాల స్థాయిలో నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ వంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులతో క్రమం తప్పకుండా మాట్లాడి పిల్లల సమస్యలు, లోపాలను తెలుసుకుని సరిదిద్దాలని సూచించారు. ​పాఠశాల కమిటీలు కూడా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పిల్లల్లో ప్రాథమిక అక్షరాస్యత, గణన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎఫ్.ఎల్‌.ఎన్ (FLN) వంటి పలు సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు.

విద్యా రంగంలో మన్యం జిల్లాను రాష్ట్రం లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపి, జిల్లాకే కాకుండా రాష్ట్రస్థాయిలో మన్యం నెంబర్ వన్ గా గుర్తింపు తెచ్చిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లితండ్రులను కలెక్టర్ అభినందించారు. నెంబర్ వన్ తెచ్చుకోవడమే కాకుండా దాన్ని జీవితంలో నిలబెట్టుకోవడానికి కృషిచేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తపన ఉంటే విద్యార్థులు ఏదైనా సాధించగలరని, ఆ విధంగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తోందని, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే భ్రమలను వీడి, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సదుపాయాలు, బోధనా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ,రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ల డైరెక్టర్లు గొట్టాపు వెంకట నాయుడు, వై.రమణా రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, జిల్లా విద్యా శాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి వి.హరిగోపాల్, సమగ్ర శిక్ష ఏపీసీ బి.రాజ్ కుమార్, జిల్లా ఎస్సీ సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ.విజయశాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ప్రతిభా అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story