Vizianagaram: విశాఖ మేయర్ పీఠం స్థానికులకే దక్కాలి!

Vizianagaram: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని విశాఖ స్థానికులకే కేటాయించాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు.

GOPI, PENDURTHI
Published on: 15 Oct 2026 4:23 PM IST
Vizianagaram
X

Vizianagaram: విశాఖ మేయర్ పీఠం స్థానికులకే దక్కాలి!

విజయనగరం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని విశాఖకు చెందిన స్థానికులకే కేటాయించాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ డిమాండ్ చేశారు. విశాఖ నగర ప్రజల మనోభావాలు, స్థానికుల ఆకాంక్షలను గౌరవిస్తూ మేయర్ అభ్యర్థి ఎంపిక జరగాలని ఆయన స్పష్టం చేశారు.

స్థానికేతర వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్రంగా వ్యతిరేకించి, ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను విజయనగరంలో ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం కలిసి వినతిపత్రం అందజేసిన బి.వి.రామ్, విశాఖ నగర భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మేయర్ పదవి కేవలం రాజకీయ నియామకం కాదని, విశాఖ ప్రజల ఆశయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమని, పోర్టు, ఉక్కు పరిశ్రమ, ఐటీ, పర్యాటకం, విద్య, ఆరోగ్య రంగాల్లో కీలక కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. ఇలాంటి నగరాన్ని సమర్థవంతంగా నడిపించాలంటే స్థానిక సమస్యలు, వార్డుల అవసరాలు, ప్రజల జీవన విధానంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడే మేయర్‌గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

స్థానిక ప్రజలతో అనుబంధం లేని నాయకులుకి మేయర్ బాధ్యతలు అప్పగిస్తే ప్రజల ఆశలు నెరవేరే అవకాశం ఉండదని పేర్కొన్నారు. విశాఖ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని అన్నారు. స్థానికేతర నాయకుడిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే అది విశాఖ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని వ్యాఖ్యానించారు.

అలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు శక్తి ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, పౌర సమాఖ్యలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో అలాంటి అభ్యర్థిని ప్రజలతో కలిసి ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖ ప్రజల ఆకాంక్షలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం కల్పించేలా కృషి చేయాలని కోరారు.

విశాఖ అభివృద్ధి రాజకీయాలకు అతీతమని, నగర ప్రయోజనాలే అందరికీ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల వేళ మేయర్ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో తెలుగు శక్తి చేసిన ఈ డిమాండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. స్థానికులు, స్థానికేతరులు అంశం ఎన్నికల ప్రచారంలో కీలక చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశాఖ ఆత్మగౌరవమే మా లక్ష్యం..

మేయర్ పదవి విశాఖ ప్రజల హక్కు. స్థానికుల ఆశయాలను గౌరవిస్తూ స్థానిక నాయకుడికే అవకాశం కల్పించాలి. స్థానికేతరులకు టికెట్ ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో తీవ్రంగా వ్యతిరేకిస్తాంమని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ హెచ్చరించారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI