Parvathipuram: మేజిక్ డ్రైన్ల పనుల నాణ్యతపై ఐటీడీఏ పీఓ వైశాలి సీరియస్!
Parvathipuram: ఆర్.వైశాలి పెదపెంకి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి, మేజిక్ డ్రైన్ల పనుల నాణ్యతను పరిశీలించారు.
Parvathipuram: మేజిక్ డ్రైన్ల పనుల నాణ్యతపై ఐటీడీఏ పీఓ వైశాలి సీరియస్!
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలని, అభివృద్ధి పనుల పూర్తిలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలి స్పష్టం చేశారు. బుధవారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆమె విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఓ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులు, అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక నిఘా;
గ్రామంలో ప్రగతిలో ఉన్న పలు ప్రభుత్వ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేజిక్ డ్రైన్ల పనుల నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత కాలపరిమితి లోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం పెదపెంకిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో పీఓ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్య, వైద్యం, గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో ఆర్డీఓ కె.మాధురి, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.రవీంద్ర, స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల ముఖ్య అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




