Parvathipuram: శరత్‌బాబు కుటుంబానికి జగన్ సాయం.. రూ.3 లక్షల చెక్కు అందజేత!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ నేత నంగిరెడ్డి శరత్‌బాబు మృతి పట్ల జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి.

V.SESHU	, KURUPAM
Published on: 21 Jun 2026 7:23 AM IST
Parvathipuram
X

Parvathipuram: శరత్‌బాబు కుటుంబానికి జగన్ సాయం.. రూ.3 లక్షల చెక్కు అందజేత!

పార్వతీపురం మన్యం జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్‌బాబు ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. యువ నాయకుడిగా, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన శరత్‌బాబు సేవలను పార్టీ నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

శరత్‌బాబు మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, తాను వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం శరత్‌బాబు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయంగా చెక్కును పంపించారు. ఆ చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కలిసి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శరత్‌బాబు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరం వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శరత్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరత్‌బాబు కుటుంబానికి అందించిన ఆర్థిక సాయం పట్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story