Parvathipuram: చెరువుల రక్షణే లక్ష్యం.. రేపటి నుంచే ‘జలరక్షణ’ వేట మొదలు!
Parvathipuram: పార్వతీపురం జిల్లాలో సోమవారం నుంచి 'జలరక్షణ' కార్యక్రమం ప్రారంభం.
Parvathipuram: చెరువుల రక్షణే లక్ష్యం.. రేపటి నుంచే ‘జలరక్షణ’ వేట మొదలు!
పార్వతీపురం: జిల్లావ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల సంరక్షణే ధ్యేయంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కావున చెరువుల హద్దుల గుర్తింపుపై తహసిల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రేపు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో కచ్చితంగా అమలుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాల అమల్లో జిల్లా ముందంజలో ఉందని, ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.
ఇకపై ఈ కార్యక్రమంతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. శనివారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జలవనరుల శాఖ ఇంజినీర్లు, డ్వామా ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారంలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి, సోమవారం నాటికి క్షేత్రస్థాయి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ హద్దుల ప్రక్రియలో ఎటువంటి ఒత్తిడిలకు గురికావద్దని, సమస్యలు తలెత్తితే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
మండల పరిధిలోని చెరువుల హద్దుల గుర్తింపుపై తహసిల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఏ చెరువుకు హద్దులు నిర్ణయించారో దానికి సంబంధించిన నివేదికను (గ్రామం పేరు, చెరువు పేరు, హద్దుల వివరాలతో సహా) ఆదివారంలోగా ఖరారు చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి ఫొటోలను గ్రూపుల్లో పోస్ట్ చేసే పూర్తి బాధ్యతను ఎంపీడీఓలకే అప్పగిస్తున్నట్లు కలెక్టర్ తేల్చిచెప్పారు.
సోమవారం ఉదయం చెరువుల వద్ద అధికారుల ఫొటో షూట్
జలరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ప్రతి తహసిల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా తమ పరిధిలోని ఏదో ఒక చెరువు వద్ద నిలబడి ఫొటో దిగి పంపించాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఫొటో దిగినా లేదా విడివిడిగా వేర్వేరు గ్రామాల్లో పాల్గొన్నా అభ్యంతరం లేదని, అయితే సోమవారం గ్రీవెన్స్ (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి హాజరయ్యే ముందే ఈ ప్రక్రియను ముగించి ఫొటోలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
ట్రెంచ్ తవ్వకాలలో సాంకేతిక నిబంధనలు ఇవే
ట్రెంచ్ తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. శనివారం సాయంత్రంలోగా పెద్ద చెరువులను ఎంపిక చేసుకుని పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని, హద్దుల విషయంలో ఒక్క అడుగు కూడా వదలకుండా ట్రెంచ్ తవ్వకాలు జరపాలన్నారు. పశువులు, మేకలు చెరువులోకి వెళ్లి నీరు తాగేందుకు వీలుగా నిరంతరాయంగా కాకుండా, ఒక ట్రెంచ్‌కు మరో ట్రెంచ్‌కు మధ్యలో 3 అడుగుల గ్యాప్ వదిలి (స్టాగ్గర్ పద్ధతిలో) తవ్వాలన్నారు. ట్రెంచ్ లోతు ఖచ్చితంగా ఒక మీటరు (సుమారు 3 అడుగులు) ఉండాలని,అర అడుగు, అడుగు లోతు తీసి వదిలేస్తే మట్టి పూడికిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ట్రెంచ్ తవ్వగా వచ్చిన మట్టితో చెరువు లోపలి వైపు ఒక కట్టలా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కట్టపై ఒక రకమైన మొక్క, ట్రెంచ్ లోపల మరో రకమైన మొక్కను నాటుతూ సమాంతరంగా 'టూ-లేయర్' ప్లాంటేషన్ చేపట్టాలని డ్వామా సిబ్బందిని, ఏపీఎంలను ఆదేశించారు. ఈ జలరక్షణ కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఇంచార్జి జేసీ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జలవనరుల శాఖ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.




