Parvathipuram: పార్వతీపురం భూ రీ-సర్వే పనులను వేగవంతం చేయండి

Parvathipuram: పార్వతీపురంలో భూ రీ-సర్వేపై జేసీ ఆర్. వైశాలి సమీక్ష. నెట్‌వర్క్ లేని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 9 July 2026 2:56 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం భూ రీ-సర్వే పనులను వేగవంతం చేయండి

పార్వతీపురం: జిల్లాలో రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు, నెట్‌వర్క్ సౌకర్యం లేని (నాన్-సిగ్నల్) గ్రామాల్లో సర్వే ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సర్వే అధికారులను ఆదేశించారు. రీ-సర్వే పనుల పురోగతి, నాన్-సిగ్నల్ గ్రామాల్లో సర్వే నిర్వహణలపై ఏడీ సర్వే, మండల, గ్రామ సర్వేయర్లతో సమీక్షా సమావేశాన్ని ఆమె ఛాంబరులో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె గ్రామాల వారీగా రీ-సర్వే ప్రస్తుత పురోగతి, పెండింగ్ అంశాలు మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నెట్‌వర్క్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో డేటా సేకరణ ఏ విధంగా జరుగుతోంది, సేకరించిన డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానాలు, ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై ప్రత్యేకంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి తప్పులు లేని, అత్యంత ఖచ్చితమైన భూ రికార్డులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కావున పనుల్లో నాణ్యతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో డేటా సేకరణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సాంకేతిక సహాయం అందించాలని ఆదేశించారు. AD సర్వే, DIOS, మండల, గ్రామ సర్వేయర్లు నిరంతరం ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో తలెత్తే భూ వివాదాలను లేదా సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలన్నారు.

అలాగే నిర్దేశించుకున్న నిర్ణీత కాల వ్యవధిలోనే రీ-సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ​ఈ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి రీ-సర్వేను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సర్వే విభాగానికి చెందిన ఉన్నతాధికారులు, మండల, గ్రామ సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story