Parvathipuram: గెడ్డ దాటితేనే ఊళ్లోకి అడుగు కంటుగూడలో రోడ్డు లేక కష్టాలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం కురుపాం మండలం కంటుగూడ గ్రామానికి సరైన రహదారి, వంతెన లేకపోవడంతో విద్యార్థులు, గర్భిణులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

V.SESHU	, KURUPAM
Published on: 11 Aug 2026 9:02 AM IST
Parvathipuram
X

Parvathipuram: గెడ్డ దాటితేనే ఊళ్లోకి అడుగు కంటుగూడలో రోడ్డు లేక కష్టాలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామ ప్రజలు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గెడ్డ దాటాల్సిన పరిస్థితి ఉండటంతో గ్రామస్తుల జీవనం దుర్భరంగా మారింది.

ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి గెడ్డ దాటి ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో గెడ్డలో నీటి ప్రవాహం పెరిగితే విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతోందని, చిన్నారులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేందుకు కూడా సరైన రహదారి లేక మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు.

వర్షాలు అధికంగా కురిసే రోజుల్లో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తే గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.

ప్రజల కనీస అవసరమైన రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కులు దూరమవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంటుగూడ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని, గెడ్డ దాటే ప్రాంతంలో వంతెన లేదా కల్వర్టు నిర్మించి గ్రామ ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story