Kurupam: బాలికల సాధికారతే లక్ష్యం..ఎంపీడీవో ఉమామహేశ్వరి
Kurupam: కురుపాం మండలంలో 'బేటీ బచావో – బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా 'కిషోరి వికాసం' ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Kurupam: బాలికల సాధికారతే లక్ష్యం..ఎంపీడీవో ఉమామహేశ్వరి
కురూపం: బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాలికల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా “కిషోరి వికాసం” పేరుతో ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కురుపాం ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి తెలిపారు. మే 1 నుంచి జూన్ 11 వరకు కురుపాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ శిబిరాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ టి.కనకదుర్గ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కురుపాం ఎంపీడీవో మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాలబాలికల వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ, స్వీయ అవగాహన పెంపు లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. విద్య ప్రాముఖ్యత, పోషకాహారం, ఋతు పరిశుభ్రత, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, టీనేజ్ గర్భధారణ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ భద్రత, జీవనోపాధి అవకాశాలు, కెరీర్ కౌన్సెలింగ్, ఆర్థిక నిర్వహణపై కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ కురుపాం ప్రాజెక్ట్ సీడీపీఓ రజిని మాట్లాడుతూ బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యపై దృష్టి సారించి సమాజంలో ధైర్యంగా ముందుకు రావాలని బాలికలకు సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను శిబిరాలకు పంపించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి బాలబాలికలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, వాటిని గుర్తించి మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పిల్లలు తమ ఆసక్తులు, ప్రతిభలను తెలుసుకుని స్వీయ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి బాలిక ఈ శిబిరాల్లో పాల్గొని తన భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 60 మంది బాలికలు, 40 మంది బాలురు పాల్గొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు రామలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ విభాగం అవుట్‌రీచ్ వర్కర్ రావాడ హరికృష్ణ, ఆశా వర్కర్లు, విలేజ్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.




