Kurupam: కురుపాం మాలతమ్మ ఆలయంలో శాఖంబరి దేవి అలంకరణ

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలోని మాలతమ్మ తల్లి ఆలయంలో శాఖంబరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు. తరలివచ్చిన భక్తులు.

V.SESHU	, KURUPAM
Published on: 26 July 2026 9:53 AM IST
Kurupam
X

Kurupam: కురుపాం మాలతమ్మ ఆలయంలో శాఖంబరి దేవి అలంకరణ

కురుపాం: కురుపాం ఏజెన్సీ ప్రాంత గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ మాలతమ్మ తల్లి ఆలయంలో ఆదివారం విశేష ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నేరేడువలస గ్రామ సమీపంలోని మాలతమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు శాఖంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు.

కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, పుష్పాలతో అత్యంత వైభవంగా అలంకరించిన శాఖంబరి దేవి రూపం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ప్రకృతి సంపదకు ప్రతీకగా భావించే ఈ అలంకరణలో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

గిరిజనుల విశ్వాసాల ప్రకారం తమ జీవితంలో ఏ శుభకార్యమైనా, కొత్త కార్యక్రమమైనా ప్రారంభించే ముందు మాలతమ్మ తల్లికి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గిరిజనులతో పాటు మైదాన ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగగా, శాఖంబరి దేవి అలంకరణలో మాలతమ్మ తల్లి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. ప్రకృతిని పరిరక్షించాలనే సందేశాన్ని చాటిచెప్పే ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story