Kurupam: ధింసా నృత్యంపై దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే
Kurupam: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ ధింసా నృత్యంపై విమర్శలను ఖండించిన ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. గిరిజన ఆత్మగౌరవంపై వ్యాఖ్యలు తగవు.
Kurupam: ధింసా నృత్యంపై దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే
కురుపాం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా 13 వేల మంది గిరిజన విద్యార్థినులు ప్రదర్శించిన ధింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం యావత్ ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ధింసా నృత్యంపై కొందరు చేస్తున్న విమర్శలు, దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు పేరు అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గిరిజన బాలికలు తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి ప్రతి ఆనంద సందర్భంలో ధింసా నృత్యం చేయడం గిరిజనుల ఆనవాయితీ అని చెప్పారు.
గిరిజన సంస్కృతిని రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని, సరైన అవగాహన లేకుండా తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజన బాలికల ప్రతిభను అభినందించాల్సిన సమయంలో వారిని అవమానించేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్ వంటి అనుభవజ్ఞులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు.
యావత్ భారతదేశం గిరిజన బాలికల ప్రతిభను ప్రశంసిస్తుంటే కొందరు విమర్శలు చేయడం సరైన వైఖరి కాదని పేర్కొన్నారు. ధింసాను అవమానించడం అంటే గిరిజన సంస్కృతిని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని అవమానించినట్లేనని స్పష్టం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయమని, ఒకప్పుడు రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేని ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి గిరిజన సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తోందని అన్నారు. గిరిజన పిల్లల ప్రతిభను రాజకీయ విమర్శలకు బలిచేయవద్దని, గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం ధింసా నృత్యంపై తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దినపత్రిక ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గిరిజన సంస్కృతిని కించపరిచే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




