Kurupam: నీలకంఠాపురంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

Kurupam: కురుపాం మండలం నీలకంఠాపురంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్ఐ రమేష్ నాయుడు. హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించిన పోలీసులు.

V.SESHU	, KURUPAM
Published on: 13 Aug 2026 4:54 PM IST
Kurupam
X

Kurupam: నీలకంఠాపురంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

కురుపాం: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నీలకంఠాపురం ఎస్‌ఐ పి. రమేష్ నాయుడు సూచించారు. కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో గురువారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువత, వాహనదారులకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించడంతో పాటు హెల్మెట్ క్లిప్‌ను సరిగా బిగించుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించినప్పటికీ క్లిప్ పెట్టుకోకపోతే ప్రమాద సమయంలో హెల్మెట్ ఊడిపోయే అవకాశం ఉందని, దీంతో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని వివరించారు.

అలాగే అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. వాహనదారులు రహదారులపై అప్రమత్తంగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు సీటు బెల్ట్, హెల్మెట్ వంటి భద్రతా పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు.

విద్యార్థులు, యువత రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంపొందించుకుని ఇతరులకు కూడా తెలియజేయాలని అన్నారు. రహదారులపై జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో కానిస్టేబుల్ వేణు చంద్రశేఖర్, హోంగార్డు రామారావు పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, వాహనదారులు పాల్గొని భద్రతా సూచనలను ఆసక్తిగా విన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story