Kurupam: డాక్యుమెంట్ రైటర్ల సమ్మె ఉన్నా ఆగని రిజిస్ట్రేషన్లు
Kurupam: డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ సమ్మె నేపథ్యంలో కురుపాం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
Kurupam: డాక్యుమెంట్ రైటర్ల సమ్మె ఉన్నా ఆగని రిజిస్ట్రేషన్లు
కురుపాం, జూలై 21: డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ సేవలను నిరంతరాయంగా అందించేందుకు కురుపాం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు సబ్-రిజిస్ట్రార్ ఆర్. ఉమా కళ్యాణి తెలిపారు.
ఈ హెల్ప్ డెస్క్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు పబ్లిక్ డేటా ఎంట్రీ (PDE), స్లాట్ బుకింగ్‌తో పాటు ఇతర రిజిస్ట్రేషన్ సంబంధిత సేవలపై అవసరమైన మార్గదర్శకత్వం, సహాయం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే మార్కెట్ విలువ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), సర్టిఫైడ్ కాపీలు, సింగిల్ సెర్చ్ సేవలు, స్టాంపుల విక్రయం వంటి సాధారణ ప్రజా సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సులభతరంగా అందించాలనే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా ప్రజలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను స్వయంగా సిద్ధం చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు అనేది రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ కాదని, కేవలం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకున్న చర్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులు సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలోనే భద్రపరచబడతాయని, మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సబ్-రిజిస్ట్రార్ పర్యవేక్షణలోనే కొనసాగుతుందని వివరించారు.
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె కారణంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర శాఖాపరమైన సేవలు అవసరమైన వారు నేరుగా కురుపాం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని సబ్-రిజిస్ట్రార్ ఆర్. ఉమా కళ్యాణి సూచించారు.




