Parvathipuram: తోటపల్లి కుడి కాలువకు నీటి విడుదల.. మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన

Parvathipuram: తోటపల్లి బ్యారేజ్ నీటి విడుదలతో మూడు జిల్లాల పరిధిలోని 84 వేల ఎకరాలకు సాగునీరు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేల సమీక్ష.

V.SESHU	, KURUPAM
Published on: 2 July 2026 4:44 PM IST
Parvathipuram
X

Parvathipuram: తోటపల్లి కుడి కాలువకు నీటి విడుదల.. మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన

పార్వతీపురం: రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గురువారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ నీటి విడుదల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి మంత్రి సంధ్యారాణి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తోటపల్లి బ్యారేజ్ ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనే అసాధారణమైన లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తోందని అన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా అంతటా ఎన్నో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది ఎంతో సంతోషదాయకమైన రోజని కొనియాడారు. కురుపాం నియోజకవర్గ రైతుల త్యాగానికి ప్రతిఫలంగా నేడు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 84,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడి దూరదృష్టికి నిదర్శనం

తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు ప్రాధాన్యతను నాడే గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2003లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అనంతరం 2015లో దీనిని జాతికి అంకితం చేశారని మంత్రి గుర్తుచేశారు.

రూ. 1127.58 కోట్ల నిధుల మంజూరు

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మూడు సార్లు అంచనాలు సవరించబడగా, ఇప్పటివరకు రూ. 1127.58 కోట్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు. తాజా దశలో SDMF ద్వారా రూ. 4.71 కోట్లు మంజూరు చేసి పనులను వేగవంతం చేశామన్నారు. 2025లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనుల కోసం ఓ&ఎం (O&M) గ్రాంట్ ద్వారా రూ. 67.60 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. పునరావాస పనులు, లష్కర్ల నియామకం, పిల్లకాలువ భూ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం తక్షణమే చేపడుతుందని హామీ ఇచ్చారు.

మూడు జిల్లాల రైతులకు లబ్ధి (84,000 ఎకరాలు)

ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మూడు జిల్లాల్లోని సుమారు 84,000 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఇందులో విజయనగరం జిల్లాలో 55,000 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాకు 24,000 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 5,000 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. మొత్తం రూ.503.23 కోట్ల భారీ మంజూరుతో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు, నీటి విడుదల కార్యక్రమంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ప్రభుత్వంపై రైతుల్లో నమ్మకం మరింత బలపడిందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్‌తోనే రైతులకు మేలు: ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ తమ ప్రాంత రైతులు మరిన్ని మంచి పంటలు పండించుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తే ఇక్కడి రైతాంగం కూటమి ప్రభుత్వానికి జన్మాంతం రుణపడి ఉంటుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కాలువకు నీరు వెళ్లేలా, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేలా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆమె ప్రశంసించారు.

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, స్థానిక సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. స్థానిక కాలువలకు నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉత్తరాంధ్రలోని మేజర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ నుంచి దాదాపు రూ. 13,000 కోట్లను మంజూరు చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఇందులో భాగంగా తోటపల్లి ప్రాజెక్టుకు రూ. 286 కోట్లు, ఝంఝావతి ప్రాజెక్టుకు రూ. 86 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల పూర్తికి స్పష్టమైన కాలపరిమితి (క్యాలెండర్) నిర్దేశించుకున్నామని.. జూన్ 2027 కల్లా పనులు ప్రారంభించి, 2029 నాటికి తోటపల్లి, ఝంఝావతి ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులమంతా కలిసి ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ అధికారులను కలిసి చర్చించి, రైతులకు మేలు జరిగేలా త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, ఆర్డీఓ కె.మాధురి, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story