Bhogapuram: ప్రతిష్ఠాత్మక వేడుకగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్!
Bhogapuram: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆగస్టు 1న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను ఐఏఎస్ అధికారులు ఎం.టి. కృష్ణబాబు, జి. వీరపాండ్యన్ పరిశీలించారు.
Bhogapuram: ప్రతిష్ఠాత్మక వేడుకగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్!
భోగాపురం: ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర ప్రతిష్ఠాత్మక వేడుకగా నిలిచేలా అన్ని ఏర్పాట్లను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రధానమంత్రి పర్యటన నోడల్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ప్రధానమంత్రి పర్యటన ప్రత్యేక అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డితో కలిసి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన వారు, ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా విమానాశ్రయ టెర్మినల్‌ను సందర్శించిన అధికారులు అరైవల్, డిపార్చర్, చెక్-ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, వీఐపీ లాంజ్‌లు, ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, లగేజ్ క్యారియర్ వ్యవస్థ, బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా, బోర్డింగ్ ప్రాంతాలు, విమానాల ల్యాండింగ్‌కు సంబంధించిన సదుపాయాలు, అంతర్గత రాకపోకల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా అనుసరించాల్సిన ప్రోటోకాల్, భద్రతా ప్రమాణాలు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలో నిర్వహించనున్న వాక్‌త్రూ మార్గాన్ని పరిశీలించి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లు, అతిథుల కదలికలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, కళాకారుల ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్, అలంకరణలు, స్వాగత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో, ఆకర్షణీయంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తదుపరి బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించి ప్రధాన వేదిక, వీవీవీఐపీ, వీఐపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు, ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, మీడియా గ్యాలరీ, నియంత్రణ కేంద్రం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, విద్యుత్, కమ్యూనికేషన్ సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రజల కదలికలు, భద్రత, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో అన్ని పనులను పూర్తిచేసి, ప్రతి ఏర్పాటును పలుమార్లు తనిఖీ చేసి కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి ఏర్పాటును నిరంతరం పర్యవేక్షిస్తూ, అధికారులకు అవసరమైన సూచనలు అందిస్తూ, ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ఠను చాటిచెప్పే విధంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో రాష్ట్ర ఎయిర్‌పోర్ట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ డా. పి. సంపత్ కుమార్, విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ షోబిత, అదనపు ఎస్పీ సౌమ్యలత, జీఎంఆర్ ప్రతినిధులు ఐ. ప్రభాకర్ రావు, రామరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




