Vizianagaram: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాజేష్‌కు కలెక్టర్ అభినందనలు!
Vizianagaram: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన చినమల్లుపేట టీచర్ కౌలూరి రాజేష్‌ను విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
Vizianagaram: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాజేష్‌కు కలెక్టర్ అభినందనలు!
విజయనగరం: జాతీయ ఉపాధ్యాయ అవార్డు - 2026కు ఎంపికైన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ఎంపీపీ పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ కౌలూరి రాజేష్ మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజేష్‌ను దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధన అందిస్తూ, సాంకేతికతను విద్యాబోధనలో సమర్థవంతంగా వినియోగిస్తున్న రాజేష్ సేవలను జిల్లా కలెక్టర్ అభినందించారు. చిన్న చిన్న పాఠాలుగా బోధనా అంశాలను విభజించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చేయడంతో పాటు, కృత్రిమ మేధ (AI) ఆధారిత విధానాలను వినియోగించడం అభినందనీయమన్నారు.
నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ఎంపీపీ పాఠశాలలో రాజేష్ రూపొందించిన వెబ్ ఆధారిత ఇంటరాక్టివ్ AI లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్న విషయాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. అలాగే ‘హలో ధృతి’ వంటి ఉచిత ఇంటరాక్టివ్ ఫౌండేషనల్ లెర్నింగ్ యాప్, విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా AI ఆధారిత సహాయక విధానాలను రూపొందించడం ద్వారా ఆయన విద్యారంగంలో వినూత్న మార్పులకు కృషి చేస్తున్నారని తెలిపారు.
“విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణం. రాజేష్ సేవలు ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టాలి. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు లభించాలి” అని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా రాజేష్ రూపొందించిన యాప్ ను, ఆయన రాసిన పుస్తకాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి అభినందనలు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం ద్వారా విజయనగరం జిల్లా విద్యారంగానికి మరింత గౌరవం తీసుకువచ్చిన రాజేష్‌ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు పాల్గొన్నారు.




