Komarada: పూర్ణపాడు లాభేసు వంతెన పనుల కోసం మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం

Komarada: కొమరాడ మండలం పూర్ణపాడు-లాభేసు వంతెన పనుల పూర్తికి సాధన కమిటీ పాదయాత్ర. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి చేతుల మీదుగా ప్రారంభం.

V.SESHU	, KURUPAM
Published on: 3 July 2026 8:47 AM IST
Komarada
X

Komarada: పూర్ణపాడు లాభేసు వంతెన పనుల కోసం మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం

కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు–లాభేసు వంతెన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. పూర్ణపాడు గ్రామం నుంచి గుమ్మలక్ష్మీపురంలోని కురుపాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జూలై 2, 3, 4 తేదీల్లో కొనసాగనుంది.

పాదయాత్రను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నాగావళి నది తీరంలో మహిళలు హారతులు ఇస్తూ పాదయాత్రకు తమ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, పూర్ణపాడు–లాభేసు వంతెన నిర్మాణ పనులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, జేఏసీ నాయకులు మల్లయ్య, గంగాధర్, సీతారాం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సింహాచలం, కృష్ణ, అనిల్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు వి. ఇందిర, ఎన్‌వై నాయుడు, బీవీ రమణ, మన్మధరావు, బి. లక్ష్మి, కోరాడ ఈశ్వరరావు, ఎం. శ్రీనివాసరావు, ఎస్. ఉమామహేశ్వరరావు, దాసరి వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రకు స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story