Kurupam: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం.. హోంమంత్రి అనితపై పుష్పశ్రీవాణి విమర్శలు

Kurupam: కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమం "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" విజయవంతమైంది.

V.SESHU	, KURUPAM
Published on: 13 Jun 2026 8:17 AM IST
Kurupam
X

Kurupam: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం.. హోంమంత్రి అనితపై పుష్పశ్రీవాణి విమర్శలు

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు.

అనంతరం నిర్వహించిన సభలో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్కామ్‌ల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో అమలుపై కన్నా రెడ్‌బుక్ రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని మండిపడ్డారు. సీబీఎన్‌లో ‘సీ’ అంటే చీటింగ్, ‘బీ’ అంటే బాదుడు, ‘ఎన్’ అంటే నేరాలని, అలాగే ఎన్డీయేలో ‘ఎన్’ అంటే నేరాలు, ‘డీ’ అంటే దోపిడీ, ‘ఏ’ అంటే అరాచకాలని ఎద్దేవా చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించలేదని ప్రశ్నించారు.

శాంతి భద్రతలను కాపాడాల్సిన హోంమంత్రి, మాజీ ముఖ్యమంత్రిపై సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి తన మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళ అన్న విషయం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని, హోంమంత్రి పదవి వచ్చిందని అహంకారంగా వ్యవహరించకూడదన్నారు. అనితకు హోంశాఖ కంటే సభ్యత, సంస్కారం శాఖ ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమం లో మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story