Parvathipuram: బీసీలకు ఏపీ ప్రభుత్వం సోలార్ వరం!
Parvathipuram: పీఎం సూర్య ఘర్ పథకం కింద బీసీ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ వరం.
Parvathipuram: బీసీలకు ఏపీ ప్రభుత్వం సోలార్ వరం!
పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' (PM-Surya Ghar: Muft Bijli Yojana) కింద వెనకబడిన తరగతుల (బీసీ) గృహ వినియోగదారులకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెం. 58 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.20,000 అదనపు సబ్సిడీ
నెలకు 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగం ఉన్న బీసీ కుటుంబాలకు, 2 కిలోవాట్ల (2 KWp) వరకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి (CFA) అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000ల అదనపు సబ్సిడీని మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27.2 లక్షల మంది బీసీ వినియోగదారులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ అదనపు సబ్సిడీ అమలు కోసం ప్రభుత్వం రూ.5,445.7 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిధులను కేటాయించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
అర్హులైన బీసీ గృహ విద్యుత్ వినియోగదారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్థానిక విద్యుత్ శాఖ (APEPDCL) లేదా నెడ్‌క్యాప్ (NREDCAP) అధికారులను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.




