Parvathipuram: భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దండి.. మన్యం కలెక్టర్
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Parvathipuram: భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దండి.. మన్యం కలెక్టర్
Parvathipuram: ఉపాధ్యాయులు తమ బాధ్యతలను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సైన్స్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రేరణాత్మకంగా మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో ఉపాధ్యాయులకు ఎన్నో సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నాయని, యూట్యూబ్, డిజిటల్ స్క్రీన్స్, 3డీ యానిమేషన్స్ వంటి ఆధునిక సాధనాలతో విద్యార్థులకు సైన్స్ పాఠాలను మరింత సులభంగా, ఆసక్తికరంగా బోధించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలని, శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ముందుండాలని సూచించారు. ఉద్యోగం అంటే కేవలం విధులు నిర్వర్తించడం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా పనిచేయడమని చెప్పారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులలో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందించే కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సమాజం నేడు అనుభవిస్తున్న సాంకేతిక అభివృద్ధి వెనుక శాస్త్రవేత్తల అహర్నిశల కృషి ఉందని గుర్తుచేసిన కలెక్టర్, అదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు కూడా సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




