Parvathipuram: పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు
Parvathipuram: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాలు. ఆగస్టు 31న తుది జాబితా విడుదల.
Parvathipuram: పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు
పార్వతీపురం: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పరిశీలన, ఆన్‌లైన్ డేటా అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి, 'SEC-EMS' (ఎలక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్‌లో ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు చేశారు.
ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని, సాధారణంగా ఒక పోలింగ్ కేంద్రానికి సుమారు 650 మంది ఓటర్లను కేటాయించాలని నిబంధన విధించారు. ఒకవేళ ఓటర్ల సంఖ్య పరిమితి దాటితే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల కోసం వీలైనంత వరకు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి సాధారణంగా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలని, అయితే కొండ మరియు అటవీ ప్రాంతాలకు ఇందులో మినహాయింపు ఉంటుందని తెలిపారు.
అలాగే పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు మరియు ప్రైవేట్ భవనాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటును పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమీషన్ నిర్ణయించిన సమయపాలన ప్రకారం పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను ఆగస్టు 21 నాటికి సిద్ధం చేసి, ఆగస్టు 23న ప్రచురించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు లేదా వినతులను ఆగస్టు 26 వరకు స్వీకరిస్తారని తెలిపారు.
అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారికంగా ప్రచురిస్తారని వివరించారు.పోలింగ్ కేంద్రాలకు సంబంధించి భవనం పేరు, గదుల వివరాలు, ఓటర్ల సంఖ్య, భవనం ఛాయాచిత్రాలు మరియు అక్షాంశ-రేఖాంశాలు వంటి అన్ని వివరాలను SEC-EMS పోర్టల్‌లో పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను పార్వతీపురం, పాలకొండ డివిజనల్ పంచాయతీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు.




