Parvathipuram: మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా హెచ్చరిక!

Parvathipuram: పార్వతీపురం పట్టణంలో వారానికి ఒకసారే తాగునీరు. కలుషిత నీటితో ప్రజల రోగాలు; సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఎఫ్‌ఏసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 21 July 2026 1:39 PM IST
Parvathipuram
X

Parvathipuram: మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా హెచ్చరిక!

Parvathipuram: జిల్లా కేంద్రమైన పార్వతిపురం మున్సిపల్ పట్టణ ప్రజలకు కనీసం మంచినీరు సౌకర్యం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం దుర్మార్గమని సిపిఎం పార్వతీపురం పట్టణ కమిటీ సభ్యులు విమర్శించారు. మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఎఫ్ఏసి కమిషనర్జి.శ్రీనివాసరాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచినీరు అందడమంటే దిన దిన గండంగా అందని ద్రాక్షల మారుతుందని తెలిపారు.

పట్టణ ప్రజలకు మంచినీరు వారానికి ఒకసారి మాత్రమే అందే పరిస్థితి నెలకొందని అన్నారు. బొగ్గులవీధిలో అధికారులు కాలువలు నిర్మాణ ప్రక్రియలో భాగంగా కుళాయి పైపులైన్లు పూర్తిగా తొలగించారని, వాటిని మల్ల యధావిధిగా నిర్మించే ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని గుర్తు చేశారు. కానీ ప్రతి నెలకోసారి కొళాయిపన్ను మాత్రం వేలల్లో వసూలు చేస్తున్నారని, ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు.

వర్షాకాలం వలన నీరు బురదగా మారి కలుషితంగా చేరుతుందని, దానివలన బాలింతలు, వృద్ధులు, పట్టణ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో వస్తున్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలే తప్ప శాశ్వత పరిష్కారాలు చూపకపోవడం అన్యాయమని వాపోయారు. పట్టణ ప్రజలు వేళల్లో చెల్లిస్తున్న పన్నులను ఆదాయ లెక్కల్లో చూపడమే తప్ప, మంచినీరు అందించే అభివృద్ధి పనుల ప్రక్రియలో చూపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కావున ఇకనైనా మున్సిపల్ ఉన్నత శాఖ అధికారులు దృష్టి సారించి బొగ్గులవీధిలో కులాయి పైపులైన్లు యధావిధిగా నిర్మించాలని, పట్టణ ప్రజలకు మంచినీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే బురద నీరు నివారణకు తగు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పట్టణ ప్రజలతో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బి.సూరిబాబు,ఎస్.ఉమామహేశ్వరరావు, ఎస్.మౌళి, పి.రాజశేఖర్ పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story