Parvathipuram: పార్వతీపురం చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్‌కు కసరత్తు
Parvathipuram: మన్యం జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు. ఐటీడీఏ పీవో వైశాలి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహణ.
Parvathipuram: పార్వతీపురం చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్‌కు కసరత్తు
పార్వతీపురం: మన్యం జిల్లాలో చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగును ప్రోత్సహించడంతో పాటు, గిరిజన రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఒక భారీ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు అడుగులు పడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వైశాలి తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధ్యక్షతన తొలి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాలపై అధికారులు, శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ మాట్లాడుతూ.. మన్యం జిల్లాలో చిరుధాన్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం, దిగుబడి సామర్థ్యం మరియు ఉత్పత్తి గణాంకాలను పీఓ దృష్టికి తెచ్చారు.
కేవీకే రస్తాకుంటుభాయి హోమ్ సైన్స్ శాస్త్రవేత్త డా. ఉమాజ్యోతి ప్రస్తుతం కేవీకేలో అందుబాటులో ఉన్న మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు, చిరుధాన్యాలతో తయారు చేయగల విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
మన్యంలో లభించే చిరుధాన్యాలకు ప్రాసెసింగ్ యూనిట్ తోడైతే, గిరిజన రైతులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయని ఐటీడీఏ పీవో వైశాలి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాన్ని ప్రాథమిక చర్చగా పరిగణించి, తదుపరి సమావేశం నాటికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి ఆర్. అన్నపూర్ణ, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త డా. ఎస్.శ్రీనివాసరాజు, డీఆర్డీఏ పీడీ ప్రభావతి, ఐటీడీఏ ఏపీఓ పి. మురళీధర్, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




