Kurupam: వీధి కుక్కల దాడిలో 30 మేకపిల్లలు మృతి.. రూ.70 వేల నష్టం!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదోరవలసలో వీధి కుక్కల దాడిలో రైతు బొబ్బిలి లక్ష్మణరావుకు చెందిన 30 మేకపిల్లలు మృతి చెందడంతో రూ.70 వేల నష్టం వాటిల్లింది.
Kurupam: వీధి కుక్కల దాడిలో 30 మేకపిల్లలు మృతి.. రూ.70 వేల నష్టం!
కురుపాం: వీధి కుక్కల దాడితో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదోరవలస గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి రైతు బొబ్బిలి లక్ష్మణరావుకు చెందిన మేకల మందపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 30 మేకపిల్లలు మృతి చెందగా, మరో ఐదు మేకపిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి.
ఈ దాడిలో సుమారు రూ.70 వేల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పెంచుకున్న మేకపిల్లలు కుక్కల దాడిలో మృత్యువాత పడటంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. జీవనోపాధిగా ఉన్న మేకల పెంపకంపై ఆధారపడిన తనకు ఈ ఘటన తీరని నష్టాన్ని మిగిల్చిందని వాపోయారు.
సంబంధిత అధికారులు ఘటనపై స్పందించి నష్టాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.




