Parvathipuram: నరాలు తెగే ఉత్కంఠ నడుమ పాలకొండ మండల ఎంపీపీ ఎన్నిక!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండల ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠకు తెరపడింది. 12 ఎంపీటీసీలకు గాను 9 ఓట్లతో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్గానికి చెందిన కర్నేన యోగిత ఎంపీపీగా గెలుపొందారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 Nov 2026 3:00 PM IST
Parvathipuram
X

Parvathipuram: నరాలు తెగే ఉత్కంఠ నడుమ పాలకొండ మండల ఎంపీపీ ఎన్నిక!

పార్వతీపురం: రాష్ట్రం మొత్తం నేడు ఎంపీటీసీల ప్రమాణస్వీకారం ఎంపీపీ ఎన్నిక పండగ వాతావరణంలో జరుగుతున్నవేళ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో చివరి నిమిషం వరకు ఎంపీపీ పీఠంపై సస్పెన్స్ వీడలేదు. మొత్తం 12 ఎంపీటీసీ లు ఉన్న పాలకొండ మండలంలో 11 స్థానాలు గెలుచుకుని కూటమి సత్తా చాటింది. అయితే విజయం వరించిన వెంటనే కూటమిలో కొత్త చర్చ తెరపైకి రావడంతో ఆ సస్పెన్స్ ఈరోజు ఉదయం దాకా కొనసాగింది.

నిజానికి 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించడంతో నిమ్మక జయకృష్ణ పాలకొండ శాసనసభ్యులుగా గెలుపొందారు. పాలకొండ నగరపంచాయితీ ఎన్నికలలో సైతం చైర్మన్ స్థానాన్ని జనసేనకే కేటాయించడంతో పల్లా విజయనిర్మల చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీనితో ఎంపీపీ పీఠంపై తెలుగుదేశం క్యాడర్ ఆశలు పెట్టుకుంది దానికి తగినట్టే ఆశవాహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కడుపుతూ వచ్చారు.

ముఖ్యంగా పాలకొండ టీడీపీ సీనియర్ నాయకులు కర్నేన అప్పలనాయుడు, పాలకొండ మండల తెలుగుదేశం అధ్యక్షుడు గండి రామినాయుడు మధ్య ఢీ అంటే ఢీ అనేలా పోటీ నడిచింది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అనుచరుడిగా పేరుపొందిన కర్నేన అప్పలనాయుడు కు టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి అనుచరుడు గండి రామినాయుడుకు మధ్య జరిగిన ఎంపీపీ కుర్చీలాట ఆఖరికి విజయం జయకృష్ణ వర్గానికే దక్కింది. సభ్యుల నుండి ఓటింగ్ ప్రక్రియ చేపట్టడంతో 12 ఎంపీటీసీ లకు గానూ 9 మంది కర్నేన అప్పలనాయుడు సతీమణి కర్నేన యోగితను పాలకొండ ఎంపీపీగా ఎన్నుకున్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA