Gummalakshmipuram: తోట గ్రామంలో ఎస్పీ మాధవ్ రెడ్డి పర్యటన!
Gummalakshmipuram: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ పంచాయతీ తోట గ్రామంలో పర్యటించారు.
Gummalakshmipuram: తోట గ్రామంలో ఎస్పీ మాధవ్ రెడ్డి పర్యటన!
Gummalakshmipuram: పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని తోట గ్రామాన్ని సందర్శించారు. గిరి శిఖర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, చిన్నారులు, యువతతో ఆప్యాయంగా మమేకమై వారి సమస్యలు, అవసరాలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసు శాఖకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకమని, అనుమానాస్పద సంఘటనలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అలాగే చిల్లంగి, చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల మాటలు నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు, సీవీవీ నంబర్లు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.
చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఎస్పీ వారి చదువులు, లక్ష్యాలు, అభిరుచుల గురించి తెలుసుకుని మంచి విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ప్రోత్సహించారు. క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాల పట్ల గౌరవం వంటి విలువలను చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, మహిళలకు దుప్పట్లు, చిన్నారులకు గొడుగులు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమం కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఎల్విన్‌పేట సీఐ హరి, చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.




