Parvathipuram: రక్తదానం మరొకరి జీవితానికి అమృతం వంటిది బోనెల విజయచంద్ర
Parvathipuram: ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో శ్రీ విజయ దుర్గ బైక్ మెకానిక్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
Parvathipuram: రక్తదానం మరొకరి జీవితానికి అమృతం వంటిది బోనెల విజయచంద్ర
పార్వతీపురం: జిల్లా కేంద్రం ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా శ్రీ విజయ దుర్గ బైక్ మెకానిక్ సేవా సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అని, మీరిచ్చే రక్తం మరొకరి జీవితానికి అమృతం వంటిదని అన్నారు. కార్మిక సంఘాలు సమన్వయంతో మెలిగి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్మిక సంఘాలకు లయన్స్ వారు మరియు జిల్లా ఏరియా ఆసుపత్రి సిబ్బంది సహకరించడం అభినందనీయమని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
అలాగే రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. మన పార్వతీపురం ప్రాంతం నుంచి రక్తదాతలు ఈ మధ్యకాలంలో తగ్గిపోయారని, రక్తదానం చేయడం ద్వారా పలువురికి ప్రాణదాతలు అవుతారని, రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ముందుకు వస్తున్న కార్మిక సంఘాలకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, అందులో భాగంగానే ప్రతి కార్మిక సంఘానికి శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకోవడానికి స్థల సేకరణకు శ్రీకారం చుడుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు, ప్రముఖ వైద్యులు, మెకానిక్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, పలువురు యువత పాల్గొన్నారు.




