Vizianagaram: రైల్లో పోలీసుల మెరుపు దాడి ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టివేత

Vizianagaram: పోలీసులు బ్రహ్మపుర - విశాఖ ప్యాసింజర్ ట్రైన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇద్దరు కేరళ యువకుల నుండి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 21 May 2026 4:23 PM IST
Vizianagaram
X

Vizianagaram: రైల్లో పోలీసుల మెరుపు దాడి ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టివేత

విజయనగరం: గంజాయి, మద్యం, డ్రగ్స్, గుట్కా అక్రమ రవాణాను అరికట్టేందుకు విజయనగరం జిల్లా పోలీసులు బ్రహ్మపుర - విశాఖ ప్యాసింజర్ ట్రైన్‌లో మే 21న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు.

తనిఖీల వివరాలు:

ఒడిశాలోని బ్రహ్మపుర నుండి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 58531 ప్రయాణికులతో రద్దీగా ఉంటుందని, గంజాయి అక్రమ రవాణాకు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ ట్రైన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుండి నెల్లిమర్ల రైల్వే స్టేషన్ వరకు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలుగా ఏర్పడి ట్రైన్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రైన్‌ను చీపురుపల్లి స్టేషన్‌లో ఎక్కువ సేపు నిలపకుండా, పోలీసు బృందాలు నెల్లిమర్ల వరకు ట్రైన్‌లో ప్రయాణిస్తూ బ్యాగులు, లగేజీని పరిశీలించాయి.

అరెస్టయిన నిందితులు:

1. కొడవలం దేవినాధ్ (21 సం.), పారిపురం పోస్టు, కొడవలుం గ్రామం, కసరగాడ్ జిల్లా, కేరళ రాష్ట్రం.

2. ఏదోతా పటమాటు జోసెఫ్ (21 సం.), కుట్టంపుజా పోస్టు, వట్టటుపర గ్రామం, ఎర్నాకులం జిల్లా, కేరళ రాష్ట్రం.

వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను పలాస జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.

ఎస్పీ గారి ప్రకటన:

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, "జిల్లాలో మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడమే మా లక్ష్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తాం. ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి" అని కోరారు. పోలీసుల చర్యలను తోటి ప్రయాణికులు అభినందించినట్లు ఎస్పీ తెలిపారు.

తనిఖీల్లో పాల్గొన్న అధికారులు:

చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో చీపురుపల్లి సీఐ జి. శంకరరావు, ఎస్సైలు లోకేశ్వరరావు, లోకేష్, నారాయణరావు, మధుసూధనరావు, స్వీటీతో పాటు ఆర్పీఎఫ్, ఈగల్ టీమ్, ఎస్టీఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. తనిఖీలకు ముందు డీఎస్పీ రాఘవులు బృందాలకు దిశానిర్దేశం చేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story